దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. రోహిణి జిల్లా ప్రశాంత్ విహార్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాల బయట భారీ పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం 7:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పేలుడు తీవ్రతకు పాఠశాల ప్రహరీ గోడ ధ్వంసమైంది. స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, పేలుడికి కారణాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. స్కూల్ ముందు నిలిపి ఉన్న ఓ కారుతో పాటు సమీపంలో ఉన్న ఓ షాపు ధ్వంసమైనట్టు పేర్కొన్నారు.
భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందా? అని చుట్టుపక్కల ఉండేవారు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. పేలుడు తర్వాత దట్టమైన పొగలు వెలువడ్డాయని స్థానికుడు ఒకరు చెప్పారు. దానిని అతడు తన మొబైల్‌లో వీడియో తీసినట్టు తెలిపాడు. ‘నేను ఇంటిలో ఉండగా భారీ శబ్దం వచ్చింది.. బయటకు వచ్చి చూడగా పొగలు దట్టంగా అలుముకన్నాయి.. ఏం జరిగిందో నాకు తెలియదు.. పోలీసులు, అంబులెన్సులు అక్కడకు చేరుకున్నాయి.’ అని అతడు అన్నాడు.
సీనియర్ పోలీస్ అధికారి అమిత్ గోయల్ మాట్లాడుతూ.. ప్రశాంత్ విహార్‌లోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద ఉదయం 7.47 గంటలకు పేలుడు చోటుచేసుకుంది.. పేలుడకు కారణం ఏంటో తెలుసుకోడానికి నిపుణులతో దర్యాప్తు చేపట్టామని చెప్పారు. అయితే, ఇప్పటి వరకూ అక్కడ ఎటువంటి అనుమానిత వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. విచారణలో భాగంగా భూగర్భ మురుగునీటి వ్యవస్థను పరిశీలిస్తున్నట్టు వివరించారు. బాంబు స్క్యేడ్, ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఘటనా స్థలికి చేరుకుని, ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాగా, పేలుడు వెనుక క్రూడ్ బాంబు ఉండి ఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టీమ్ కూడా అక్కడకు రానుంది. మోవైపు, పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల కిటికీలు, కార్ల అద్ధాలు, షాపుల బోర్డులు ధ్వంసమైనట్టు స్థానికులు తెలిపారు. ఢిల్లీలో పేలుళ్లకు ఉగ్రమూకలు వ్యూహరచన చేసినట్టు ఇటీవల నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఈ తరుణంలో పేలుడు చోటుచేసుకోవడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.