వాల్మీకి గిరిజన సంక్షేమ మండలి నిధుల దుర్వినియోగం, ముడా కుంభకోణంలో ఆరోపణలు కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారుకు తలనొప్పిగా మారాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పదేపదే ఆరోపణలు చేస్తోంది. ఈ తరుణంలో జేడీఎస్ నేత, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకకు తానే తదుపరి ముఖ్యమంత్రిని తానేనని వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గం మాండ్యలో శనివారం నిర్వహించిన ‘మాండ్య టూ ఇండియా’ఉద్యోగ మేళా ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చూస్తూ ఉండండి.. తదుపరి ముఖ్యమంత్రిని నేనే.. నేను జోతిష్యుడ్ని కాదు. అయినా. చెబుతాను. ప్రజలందరూ కోరుకుంటే సీఎం ఎందుకు కాను? నాకూ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతా..’ అని పేర్కొన్నారు. ఉప-ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలు బీజేపీకి వదలిపెట్టామని, చెన్నపట్టణను తమకే కేటాయించాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. బీజేపీ దయతోనే కుమారస్వామి రాజకీయాల్లో కొనసాగుతున్నారని కమలం పార్టీ నేత బసనగౌడ పాటిల్ యత్నాళ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఖండించారు.
ఆయన వ్యాఖ్యలను తనతో పాటు సొంత పార్టీ కూడా పట్టించుకోవడం లేదని కుమారస్వామి ఎద్దేవా చేశారు. పేదలు, మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పించాల్సిన ప్రభుత్వం.. గ్యారంటీల పేరిట వారిని శక్తిహీనులను చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్‌లో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాలనపై అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఐదేళ్ల పూర్తికాక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతుందని, 2028లోపు నేను మళ్లీ సీఎం అవుతానని ఆయన జోస్యం చెప్పడం గమనార్హం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్ధరామయ్య కేసులు ఇబ్బందికరంగా మారిన వేళ.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
కాగా, శిరూరులో కొండ చరియలు విరిగిపడి చనిపోయిన హోటల్ యజమాని జనార్దన నాయక్ కుమార్తె కృతికా నాయక్‌కు బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాన్ని ఇప్పించారు. అలాగే, నవ్య- నందిత అనే కవలలకు టాటా మోటార్స్‌లో, అజయ్ కుమార్ అనే దివ్యాంగుడికి అలోరికా గ్లోబల్ బీపీఓలో ఉద్యోగం లభించింది. వారికి నియామకపత్రాలను కేంద్ర మంత్రి అందజేశారు.