రైలుకు అడ్డంగా వస్తే ఏదైనా మటాషే. రైల్వే ట్రాకులను దాటే క్రమంలో వన్యప్రాణులు తరచూ మృత్యువాతపడుతున్నాయి. అయితే, అస్సాంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం మిమ్మల్ని ఎంతగానో కదిలిస్తుంది. లోకో పైలట్ తీసుకున్న నిర్ణయం 60 ఏనుగుల ప్రాణాలను కాపాడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే సేఫ్టీ సిస్టమ్ ఇందుకు సహకరించింది. రాత్రివేళలో ఒక ఏనుగుల గుంపు.. రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా AI సేఫ్టీ సిస్టమ్ అలెర్ట్ చేయడంతో అప్రమత్తమైన లోకో పైలట్లు రైలును ఆపేశారు. అస్సాంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కామ్‌రూప్ ఎక్స్‌ప్రెస్ రైలు అక్టోబర్ 16న గౌహతి నుంచి లుండింగ్ వెళ్తోంది. రాత్రి 8.30 గంటల సమయంలో హవాయిపూర్, లంసఖండ్ స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తోంది. చిమ్మచీకటిలో రైల్వే ట్రాక్ పక్కన ఒక ఏనుగుల గుంపును ట్రైన్ డ్రైవర్ జేడీ దాస్, ఆయన అసిస్టెంట్ ఉమేష్ కుమార్ గమనించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దీంతో ఏనుగులకు కాస్త దూరంలో రైలు ఆగింది. ఆ తర్వాత 60 అడవి ఏనుగులు ట్రాక్ దాటాయి. ఏనుగులు ట్రాక్ దాటుతుండగా అసిస్టెంట్ లోకో పైలట్ తన స్మార్ట్ ఫోన్‌తో వీడియో తీశారు.
చిమ్మ చీకటిలో వేగంగా వెళ్తున్న రైలులో నుంచి లోకో పైలట్లు ఏనుగులను గమనించడానికి కారణం AI బేస్డ్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఈ సేఫ్టీ సిస్టమ్ ముందుగా అలెర్ట్ ఇవ్వడంతో లోకో పైలట్లు రైలు వేగాన్ని తగ్గించారు. ఆ తర్వాత ఏనుగులను చూసి ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. అస్సాంలో ఏనుగులు రాత్రివేళల్లో ఎక్కువగా రైల్వే ట్రాకులు దాటుతుంటాయి. వాటిని గుర్తించేందుకు ఇటీవల ఇండియన్ రైల్వేస్ పలు లైన్లలో AI ఆధారిత సేఫ్టీ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ఈ లైన్‌లో కూడా ట్రాక్‌లకు ఈ సేఫ్టీ సిస్టమ్‌ను అనుసంధానం చేయడంతో పదుల సంఖ్యలో ఏనుగులు ప్రాణాలతో బయటపడ్డాయి.
అస్సాంలోని ఇతర ఎలిఫెంట్ కారిడార్లలోనూ ఈ సేఫ్టీ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయాలని ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ ప్లాన్ చేస్తోంది. గతంలోనూ ట్రాకులు దాటుతున్న ఏనుగులను ఈ సేఫ్టీ సిస్టమ్ కాపాడగలిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే, ఒకేసారి పెద్ద సంఖ్యలో ఏనుగులను కాపాడటం మాత్రం ఇదే తొలిసారని అంటున్నారు. కాగా, ఈ AI ఆధారిత సేఫ్టీ సిస్టమ్ ద్వారా 2023లో 414 ఏనుగులను ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ కాపాడగలిగింది. అలాగే, ఈ ఏడాది అక్టోబర్ 16 వరకు 383 ఏనుగుల ప్రాణాలు నిలిపారు. ఇండియన్ రైల్వేకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే కదూ..!