హమాస్ అధినేత యహ్వా సిన్వార్ హత్యతో పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంా మారింది. అక్టోబరు 7న ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో సిన్వార్ హతమైన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా హెజ్బొల్లా శనివారం ఏకంగా ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసంపై డ్రోన్ల దాడికి దిగడం కలకలం రేపింది. మొత్తం మూడు డ్రోన్లను ప్రయోగించగా.. ఒకటి ఉత్తర ఇజ్రాయేల్‌లోని సెసెరియా నగరంలో ప్రధాని నివాసం ఉన్న భవనాన్ని తాకింది. ఆ సమయంలో నెతన్యాహు, ఆయన భార్య లేరని ఇజ్రాయేల్ అధికార వర్గాలు వెల్లడించాయి.. లెబనాన్ నుంచి దూసుకొచ్చిన మూడు డ్రోన్లల్లో రెండింటిని మధ్యలోనే కూల్చివేశామని, ఒక డ్రోన్ మాత్రం ఓ భవనాన్ని తాకిందని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.
ఈ దాడులపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. డ్రోన్ దాడులు చేసి చాలా పెద్ద తప్పు చేశారు, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెజ్బొల్లాకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయేలీలకు హాని తలపెట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారికి మూడినట్టేనని హెచ్చరించారు. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా తనపై హత్యాయత్నం ఇజ్రాయేల్ శత్రువులపై యుద్ధం కొనసాగించకుండా తమను నిరోధించలేదని స్పష్టం చేశారు.
‘నన్ను, నా భార్యను చంపడానికి ఇరాన్ ప్రాక్సీ హెజ్బొల్లా ప్రయత్నించి ఘోర తప్పిదం చేసింది.. మా దేశ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోడానికి శత్రువులపై జరుగుతోన్న ఇజ్రాయేల్ పోరాటాన్ని ఇలాంటివి అడ్డుకోలేవు.. విజయాన్ని సాధించేవరకు యుద్ధాన్ని ఆపేదే లేదు.’ అని నెతన్యాహు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
ఇరాన్, హెజ్బొల్లా, హమాస్, యెమెన్ హౌతీలను హెచ్చరించిన ఆయన.. ఇజ్రాయేల్ తన యుద్ధ లక్ష్యాలను సాధించడానికి, మా ప్రాంతంలో భవిష్యత్తు తరాలకు భద్రతే తమ లక్ష్యమని చెప్పారు. ‘నేను ఇరాన్, దాని మద్దతుదారులకు ఒకటే చెప్తున్నాను: ఇజ్రాయెల్ పౌరులకు హాని కలిగించడానికి ప్రయత్నించే ఎవరైనా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది;.. మేము ఉగ్రవాదులను, వారిని పంపించేవారిని నిర్మూలించడం కొనసాగిస్తాం.. మా బందీలను గాజా నుంచి విడిపిస్తాంరు.. యు మేము మా ఉత్తర సరిహద్దులో నివసించే మా పౌరులను సురక్షితంగా ఇళ్లకు తిరిగి పంపుతాం.. మా యుద్ధ లక్ష్యాలన్నింటినీ సాధించడానికి, రాబోయే తరాలకు మా ప్రాంతంలో భద్రతా వాస్తవికతను మార్చడానికి ఇజ్రాయేల్ నిశ్చయించుకుంది’ అని ఆయన హెచ్చరించారు.
ఈ దాడుల వెనుక ఇరాన్ ఉందని ఇజ్రాయేల్ ఆరోపిస్తోంది. మరోవైపు గాజా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో ఉత్తర గాజాలో జరిగిన దాడుల్లో 50 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. దక్షిణ లెబనాన్‌లోని బెకా లోయలో ఐదుగురు చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పైనా శనివారం ఇజ్రాయేల్ బాంబుల వర్షం కురిపించింది.