వలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడి ప్రమేయం ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ(సోమవారం) రామచంద్రపురంలో మంత్రి సుభాష్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సుభాష్ మాట్లాడుతూ.... హత్య జరిగిన తర్వాత బాధితుడు ఇంటికి విశ్వరూప్ వెళ్లారని అన్నారు.
కేసు పెట్టకుండా ఉండేందుకు 2 ఎకరాలు ఇస్తానని చెప్పారని అన్నారు. ఆ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లకుండా తన మంత్రి పదవిని విశ్వరూప్ అడ్డం పెట్టుకున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. హత్యకు గురైన వలంటీర్‌కు విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్‌తో అనుబంధం ఉందని అన్నారు. అందుకే తన కొడుకుకి శ్రీకాంత్ పేరు కూడా పెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత బాధితుల్లో ధైర్యం వచ్చి తన దగ్గరికి వచ్చారని తెలిపారు. ఈ కేసు విషయంలో న్యాయం చేయాలని కోరారు. బాధితురాలిని పోలీసు ఉన్నతాధికారుల వద్దకు తీసుకు వెళ్లానని అన్నారు. విచారణ చేయించి బాద్యులను కఠినంగా శిక్షించాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.