వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయం సహా సీఎం చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న అవినాశ్, జోగి రమేశ్ విచారణకు సహకరించట్లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ విచారణకు సహకరించకపోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై జస్టిస్ సుధాంశు దులియాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణకు సహకరించాలంటూ సుప్రీం కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిందితులు విచారణకు సహకరించకపోవడం గమనార్హం. వారు విచారణాధికారులకు సహకరించడంలేదంటూ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. అయితే దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని, పాస్ పోర్టులను కూడా అప్పగించేశామని అవినాశ్, జోగి రమేశ్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 17కి వాయిదా వేసింది.