కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ చవితి సోమవారం నుంచి 29 మంగళవారం వరకు తొమ్మిది రోజుల పాటు తిరుమల తరహాలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎప్పుడూ లేని విధంగా ప్రచార మాధ్యమాల ద్వారా భక్తులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనకాపల్లి నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారుల వద్ద బ్రహ్మోత్సవ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతంలో ఎల్‌ఈడీతో డిజిటల్ ప్రచారం నిర్వహించారు.
తొమ్మిది రోజుల పాటు నిర్వహించే హోమాలకు యాగశాలను కూడా సిద్ధం చేశారు. వసంత మండపం ప్రాకార మండపాలలో బెంగళూరు పుష్పాలతో అలంకరించే పనిలో ప్రత్యేక నిపుణులు నిమగ్నమయ్యారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఖండవల్లి రాజేశ్వరవరప్రసాదచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చకులు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. రావులపాలెం నుంచి బొబ్బర్లంక వాడపల్లి, లొల్ల ప్రాంతాలలో ముఖ ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.