రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది. ఆదివారం సెలవు దినం కావటంతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని భక్తులు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులు పొందారు.
వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవ్రేంద స్వామి మూల బృందావనానికి బంగారు కవచం సమర్పణ సేవ రమణీయంగా నిర్వహించారు. ఆదివారం కార్తీక మాస తదియ శుభదినాన్ని పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి సుప్రభాతం, నిర్మల విసర్జనం, క్షీరాభిషేకం, తులసి అర్చన, పంచామృతాభిషేకం నిర్వహించారు.