వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పిన వ్యవస్థలను తిరిగి గాడిలోకి తీసుకువస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వైసీపీ నాయకులకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. ప్రజలకే తాము జవాబు దారితనంగా ఉంటామని అన్నారు. జగన్ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఏపీలో ఎక్కడ కూడా సీ.సీ కెమెరాలు పని చేయడం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇవాళ(మంగళవారం) టీడీపీ కార్యాయలంలో హోం మంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ... పోలీసు వ్యవస్థనును గాడిలో పెట్టడానికి వందల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గంజాయి పండించి వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు చేశారు. ఐదేళ్లలో జరిగిన దాడులు, అత్యాచారాలు, హత్యలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్‌కు అస్సలు స్పెషల్ కోర్టు అంటే తెలుసా అని ప్రశ్నించారు. గతంలో నేరం జరిగితే 6 నెలలు దాటినా నిందితులు దొరికేవారు కాదని అన్నారు. ఇప్పుడు ఘటన జరిగిన 24 గంటల్లో నిందితులను పట్టుకుంటున్నామని తెలిపారు. గతంలో మహిళపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ఎందుకు పరామర్శించలేదని హోం మంత్రి వంగలపూడి అనిత అడిగారు.