అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న (సోమవారం) రాత్రి నుంచి రామగిరి, చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అటు కనగానపల్లి చెరువుకు గండి పడటంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. రామగిరి - ఎన్‌ఎస్ గేట్, ముత్తవకుంట్ల - కనగానపల్లి, తగరకుంట - కనగానపల్లి రహదారులన్నీ బ్లాక్ అయ్యాయి. ప్రసన్నయపల్లి నుంచి ఉప్పరపల్లి వరకు పండమేరు వాగు పరివాహక ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో వర్ష ప్రాంతాల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటిస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షించారు. పంట నష్టంపై అధికారులతో ఎప్పటికప్పుడు ఆరా తీశారు. పంట నష్టం, పశు నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ఉప్పరపల్లి సమీపంలో వరదలో మునిగిన ప్రాంతాలను అధికారులతో కలిసి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు.