ద్వారకా తిరుమల మండలం ఎం.నాగులపల్లి శివార్లలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కొన్ని రోజుల క్రితం చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గ్రామానికి చేరుకున్న అధికారులు చిరుత కదలికలపై నిఘా పెట్టారు. గ్రామ శివారు ప్రాంతాల్లో 15 ట్రాప్ కెమెరాలు, రెండు లైవ్ కెమెరాలు, బోను ఏర్పాటు చేశారు. అనంతరం సోమవారం రోజున వాటిని పరిశీలించి చిరుత సంచారం నిజమేనని తేల్చారు. వెంటనే దాని పాదముద్రలు ల్యాబ్‌కు పంపారు. వాటిని పరీక్షించిన అధికారులు అవి చిరుతవిగా నిర్ధరించారు.
రాజమహేంద్రవరంలో కనిపించిన చిరుత ఇదేనని గుర్తించారు. శనివారం రాత్రి భీమడోలు జంక్షన్- నాగులపల్లి మార్గంలో మళ్లీ పులి సంచారాన్ని గుర్తించారు. దీంతో భీమడోలు మండలం పోలసానిపల్లి, అర్జావారిగూడెం, అంబరుపేట.. ద్వారకా తిరుమల మండలం ఎం.నాగులపల్లి పరిసరాల్లో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. అలాగే ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు ఒంటరిగా తిరిగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వ్యవసాయ పనులకు సైతం గుంపులుగా వెళ్లాలని, చేతి కర్రలు వెంట తీసుకెళ్లాలని చెప్తున్నారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని ప్రజలేవ్వరూ భయపడవద్దని హామీ ఇస్తున్నారు.