ఏపీలోని మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త. మందుబాబులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రూ.99లకే క్వార్టర్ మద్యం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో రూ.99లకే క్వార్టర్ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ అమ్మకాలు పరిమితంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో మద్యం దుకాణానికి 3 నుంచి 8 కేసులు మాత్రమేఈ రూ.99లకే క్వార్టర్ మద్యం సరఫరా అవుతోంది. అయితే త్వరలోనే పూర్తిస్థాయిలో అమ్మకాలు జరుగుతాయని లిక్కర్ షాపు నిర్వాహకులు చెప్తున్నారు. వీటితో పాటుగా షార్ట్స్ పేరుతో విస్కీ, బ్రాందీ అమ్మకాలు కూడా జరుగుతున్నాయి.
మరోవైపు ఏపీ ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక అధికారంలోకి రాగానే.. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన మద్యం విధానాన్ని రద్దు చేసింది. నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తూ.. మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం విధానం ప్రకారం మద్యం అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే వైన్స్ షాపులలో లిక్కర్ రేట్లు గతంలో మాదిరిగానే ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.99లకే క్వార్టర్ మద్యం అందిస్తామని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో రూ.99లకే నాణ్యమైన మద్యం ఏదీ అనే సెటైర్లు కూడా వినిపించాయి.
ఈ నేపథ్యంలోనే ఏపీ ఎక్సైజ్ శాఖ.. రూ.99లకే క్వార్టర్ మద్యం అమ్మకాలను ప్రారంభించింది. అయితే ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఈ మద్యం పరిమితంగా అందుబాటులో ఉంటోంది. మరోవైపు మందుబాబుల నుంచి ఈ మద్యం కోసం డిమాండ్లు కూడా మొదలయ్యాయి. దీంతో రూ.99లకే క్వార్టర్ మద్యం ఉత్పత్తిని పెంచారు. ప్రస్తుతం నాలుగు సంస్థలు రూ.99లకే క్వార్టర్ మద్యం అందిస్తున్నాయి. ప్రభుత్వం సూచనతో ఈ సంస్థలు కూడా ఉత్పత్తిని పెంచాయి. దీంతో ప్రతి షాపునకు 3 నుంచి 8 కేసుల మద్యం సరఫరా చేస్తున్నారు. అయితే దీపావళి నాటికి 2.4 లక్షల మద్యం కేసులను అందుబాటులోకి తీసుకొస్తామని ఏపీ ఎక్సైజ్ శాఖ తెలిపింది. అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతోంది. దీంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు.