నామినేటెడ్ పదవుల విషయంలో ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. అలాగే రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు జనసేన, బీజేపీలను కూడా కలుపుకుపోయి అవసరమైన మేరకు వారికీ పదవులు కేటాయించాలనుకున్నారు. ప్రధానంగా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవిపైన, వెలిగొండ నిర్మాణ పనులపైన సమీక్షించుకున్న నేతలు అమరావతిలో సమావేశం కావాలని, అవకాశం దొరికితే సీఎంను కలవాలని తీర్మానించుకున్నారు. ఉమ్మడి ప్రకాశంకు చెందిన ఇద్దరు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, స్వామిలతోపాటు అందుబాటులో ఉన్న ఎమ్యెల్యేలు మంగళవారం మధ్యాహ్నం ఒంగోలులోని ఎమ్మెల్యే జనార్దన్ ఇంట్లో సమావేశమయ్యారు. మంగళవారం జరిగిన జడ్పీ సమావేశానికి మంత్రులతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
సోమవారం రాత్రి టెలీకాన్ఫరెన్స్‌లో నేతలంతా మాట్లాడుకుని జడ్పీ సమావేశానికి రావాలని నిర్ణయించుకున్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే జనార్దన్ ఇంట్లో మంత్రులు రవికుమార్, స్వామిలతోపాటు ఎమ్మెల్యేలు జనార్దన్, ఉగ్రనరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి, నారాయణరెడ్డి, నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్‌లు భేటీ అయ్యారు. డ్రోన్ సమ్మిట్ పనుల్లో ఉన్న ఎమ్మెల్యే సాంబశివరావు అందుబాటులో లేని విజయ్‌కుమార్, కొండయ్యలు హాజరుకాలేదు.