కడప జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు జడ్పీ మీటింగ్ హాలులో చైర్‌పర్సన్ జె.శారద అధ్యక్షతన నిర్వహించారు. అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమావేశంలో జిల్లాలోని సమస్యలపై గళం విప్పి పరిష్కారం చూపుతారని భావిస్తున్నారు. 2024 ఖరీ్‌ఫలో వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ, మినుము తదితర పంటలు పూర్తిగా ఎండిపోవడంతో బాధిత రైతులు వాటిని పశువులకు వదిలేశారు. దాదాపు 3,509 హెక్టార్లలో పంటలు ఎండిపోగా ఇందులో 2,858 హెక్టార్లలో మినుము, 651 హెక్టార్లలో వేరుశనగ ఉన్నట్లు వ్యవసాయాధికారులు నివేదికలను రూపొందించి ప్రభుత్వానికి పంపారు.
అలాగే అక్టోబరు 15 నుంచి విస్తారంగా వర్షాలు పడుతుండడంతో ఖరీఫ్ చివరిదశలో నూర్పిళ్లకు సిద్ధంగా ఉన్న వరి, మినుము, మొక్కజొన్న పంటలు 1,132 మంది రైతులకు సంబంధించి 2241.66 ఎకరాలలో దెబ్బతిన్నాయి. ఇలా ఖరీ్‌ఫలో అనావృష్టి, అతివృష్టి వర్షాల కారణంగా మొత్తంగా 10,941 ఎకరాలలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి తరుణంలో ఖరీఫ్ కష్టాలను వెంటబెట్టుకొని రబీసాగుకు సమాయత్తమవుతున్న అన్నదాతకు అవసరమైన రుణాలను బ్యాంకు అధికారులు సకాలంలో అందించకుండా మీనమేషాలను లెక్కిస్తున్నారు. దీనికి తోడు వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు పూర్తిస్థాయిలో ఇసుక ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. పైగా ఇసుక, గ్రావెల్ అక్రమ తరలింపు సాగుతున్నప్పటికి అధికారుల చర్యలు కానరావడం లేదు. భవననిర్మాణ రంగం కుదేలు కావడంతో పనులులేక కూలీలు వలసబాట పట్టారు. ఇక జిల్లాలో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీ కాలువలు శుభ్రపరిచేవారే కరువయ్యారు. వెరసి ప్రజలు దోమకాటుకు లోనై విషజ్వరాల బారిన పడుతున్నారు. ప్రస్తుత వర్షాలకు చాలా వరకు పాఠశాలలు ఉరుస్తున్నాయి. వైద్యశాలల్లో మందుల కొరత వేధిస్తోంది. వీటన్నింటిపై చర్చసాగించి ప్రజలకు న్యాయం చేయాల్సిన గురతర బాధ్యత ప్రజాప్రతినిధులపై ఎంతైనా ఉంది. కానీ పై సమస్యలపై... ఎంతమేర చర్చజరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ప్రజలు మాత్రం జిల్లాలోని సమస్యలపై ప్రజాప్రతినిధులు గళంవిప్పి పరిష్కారం చూపుతారనే గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.