ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరిహద్దుల్లో భారత్, చైనా కీలక ఒప్పందం.. రష్యాలో జిన్‌పింగ్‌తో మోదీ భేటీ

national |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 11:46 PM

రష్యాలోని కజాన్ వేదికగా జరుగుతోన్న బ్రిక్స్‌ దేశాల 16 వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలువురి నేతలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. బుధవారం వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత తొలిసారిగా ఇరువురు నేతలు కలవడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ధ్రువీకరించారు. సరిహద్దు భద్రతకు సంబంధించి భారత్-చైనాల మధ్య కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఇరుదేశాధినేతల మధ్య భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.


గత నాలుగున్నరేళ్లుగా సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు, గల్వాన్ లోయలో ఇరు సైన్యాల మధ్య ఘర్షణతో తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు సాగలేదు. గల్వాన్ ఘటన తర్వాత మోదీ, జిన్‌పింగ్‌లు 2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సమయంలో ఇరు దేశాధినేతలు మొదటిసారి అక్కడ కలిశారు. ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్నారు. కానీ, ప్రత్యకంగా మాత్రం ఇరువురి మధ్య భేటీ జరగలేదు.


భారత్‌-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి కొన్నేళ్లుగా సాగుతున్న వివాదంలో భాగంగా.. బలగాల ఉపసంహరణకు సంబంధించి రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. అనేక వారాలుగా జరుపుతున్న చర్చల్లో కీలక పురోగతి చోటు చేసుకుంది. భారత్‌-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్‌ పునఃప్రారంభంపై ఇరు దేశాల ఒక ఒప్పందానికి వచ్చినట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. దీంతో సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ, 2020లో తలెత్తిన ఉద్రిక్తతల పరిష్కారానికి మార్గం సుగమమైందని భావిస్తున్నారు.


మరోవైపు, మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చర్చలు, సంప్రదింపులతో ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభానికి శాంతియుత పరిష్కారించుకోవాలనేది తమ వైఖరి అని మరోసారి ఆయనకు స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన సహాయం చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. ప్రాంతీయంగా శాంతి-సుస్థిరత సత్వరం నెలకొనేందుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. మానవత్వానికే తమ తొలి ప్రాధాన్యమని మోదీ స్పష్టం చేశారు. మూడు నెలల్లోనే రెండోసారి తాను రష్యాకు రావడం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన బంధం, సమన్వయం, దృఢమైన విశ్వాసాలను ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com