ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. అధ్యక్షుడు రాజీనామా చేయాలని ఆందోళనలు

international |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 11:48 PM

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లు.. ఏకంగా షేక్ హసీనా ప్రభుత్వాన్నే పడగొట్టాయి. అంతేకాకుండా ఆమెను కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోయేలా చేశాయి. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి.. శాంతియుత పరిస్థితులు నెలకొంటున్న వేళ.. మరోసారి ఆ దేశంలో అగ్గిరాజుకుంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని.. మరోసారి అక్కడి విద్యార్థులు రోడ్డెక్కారు. అయితే ఇందుకు కారణం.. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్.. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా గురించి.. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడమే.


మంగళవారం రాత్రి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని సెంట్రల్ షాహీద్ మినార్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్ అధ్యక్షుడి భవనం అయిన బంగాబభన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు, సైన్యం రంగంలోకి దిగింది.


అయితే ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్.. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా లేఖ దొరకలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ రాజీనామా లెటర్‌ను వెతికేందుకు ప్రయత్నించినా అది దొరకలేదని తెలిపారు. అయితే ఆమెకు రాజీనామా లేఖ రాసి ఇచ్చే సమయం లేకపోవచ్చు అని వెల్లడించారు. కానీ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు.. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు పొంతన లేకపోవడం.. బంగ్లాదేశ్ విద్యార్థులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.


ఆగస్ట్ 5వ తేదీన షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందిన రోజు రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన మహమ్మద్ షహబుద్దీన్.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి లేఖను తనకు అందించారని.. దాన్ని నేను తీసుకుని ఆమోదం కల్పించినట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలోని న్యాయ శాఖ మంత్రి ఆసిఫ్ నజ్రుల్.. అధ్యక్షుడు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేస్తున్నారని.. అందుకు ఆయన్ను తొలగించేందుకు రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నాయని తెలిపారు.


ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి విద్యార్థులు చేస్తున్న నిరసనల్లో కొన్ని డిమాండ్లను తెరపైకి తీసుకువచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 1972లో బంగ్లాదేశ్ ఏర్పడినపుడు రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంస్థ ‘బంగ్లాదేశ్ చత్రా లీగ్‌’ను నిషేధించాలని తెలిపారు. ఇక షేక్ హసీనా హయాంలో 2014, 2018, 2024లో జరిగిన ఎన్నికలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.


ఆ ఎన్నికల్లో గెలిచిన పార్లమెంటు సభ్యులపై అనర్హత వేటు వేయాలని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై-ఆగస్టు నెలల్లో విద్యార్థులు చేసిన ఆందోళనలకు స్ఫూర్తికి రిపబ్లిక్ బంగ్లాదేశ్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మహమ్మద్ షహబుద్దీన్ బంగ్లాదేశ్‌కు 16వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మహమ్మద్ షహబుద్దీన్‌ను నామినేట్ చేయగా 2023 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతుండగా.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com