ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. అదానీతో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణం రద్దు చేయాలని కోరారు. అక్రమ ఒప్పందంతో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం లక్షా 50 వేల కోట్లు రూపాయలు... కాబట్టి వెంటనే డీల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు నిరూపించాయని వైఎస్ షర్మిల గుర్తుచేశారు.
స్కీంల కోసం స్కాంలకు పాల్పడ్డట్లు ఆధారాలు సైతం చూపించాయని చెప్పారు. అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా రూ.1750కోట్లు నేరుగా లంచాలు ముట్టినట్లు అమెరికా కోర్టులో తీవ్ర అభియోగాలు మోపబడ్డాయన్నారు. దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట పరువును తీశారని ధ్వజమెత్తారు. ఇటువంటి ఒప్పందాలపై విచారణ చేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు.