శ్రీశైలం-హైదరాబాద్ హైవే రద్దీ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు మల్లన్న దేవాలయానికి వెళ్లే మార్గాల్లో రద్దీని చక్కదిద్దాలని సూచించారు. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రాకపోకలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. శాశ్వత పరిష్కారానికి సమగ్ర అధ్యయనం చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.కార్తీక మాసం కావడంతో వేలాదిగా భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వస్తున్నారని అధికారులు తెలిపారు.
రానున్న రోజుల్లో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యను స్వయంగా పరిశీలించి, పరిష్కార మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ, ఎన్హెచ్ఏఐ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే పొరుగు రాష్ట్ర అధికారులతో సమస్యపై చర్చించి, సమన్వయంతో భక్తుల ఇబ్బందులను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.