అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సోమవారం మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇటీవల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారని, ఉద్యోగుల రాజ్య బీమా (ఈఎస్‌ఐ) సంస్థ ఆమోదం, భూమి కేటాయింపు, ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు వంటి వివరాలను వెల్లడించాలని కోరారు.
దీనిపై కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా మాట్లాడుతూ, అచ్యుతాపురంలో 30 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు 2020 ఫిబ్రవరి 21న ఉద్యోగుల రాజ్య బీమా (ఈఎస్‌ఐ) సంస్థ ఆమోదం తెలిపిందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని కేటాయించగా, చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం జరిగిందన్నారు. ఆస్పత్రి నిర్మాణ పనులను సీపీడబ్ల్యూ విభాగానికి అప్పగించినట్టు చెప్పారు. ఆస్పత్రి భవన నిర్మాణానికి మూడు నెలల క్రితం రూ.62 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు.