గుంటూరు జిల్లాలో రహదారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని రహదారులు, వంతెనల నిర్మాణం, అభివృద్ధి కోసం 559.84 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలో 719 కిలోమీటర్ల మేర రహదారుల్లో మరమ్మతులు చేస్తారు. గుంతలు పూడ్చి రోడ్లు వేస్తారు. వాటితోపాటు ఆగిపోయిన ఆర్వోబీలు, వంతెనలు నిర్మించడానికి కూడా నిధులు కేటాయించారు. ఎండీఆర్ ప్లాన్ కింద జిల్లాలోని 3 రహదారుల్లో 15.6 కి.మీ మేర రోడ్లు వేయనున్నారు. ఇతర జిల్లాలను కలిపే 4 రోడ్లలో 18.4 కి.మీ మేర రోడ్లు వేస్తున్నారు.
సీఆర్‌ఎఫ్ నిధుల కింద 3 రోడ్లలో 14.75 కి.మీ మేర రోడ్లు వేస్తున్నారు. కాగా న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ఫేజ్- 1 కింద 262.64 కోట్లతో జిల్లాలోని 13 రోడ్లు 94.11 కి.మీ మేర నిర్మిచనున్నారు. బాగా దెబ్బతిన్న 12 రోడ్లలో 69.84 కి.మీ మేర మరమ్మతులు చేపట్టగా, 50 రోడ్లకు సంబంధించి 222 కి.మీ మేర తక్షణ మరమ్మతులు, ప్యాచ్ వర్కులు చేపట్టనున్నారు. ఇంటెన్సివ్ ప్యాచ్ వర్కుల కింద 19 రోడ్లలో 107.79కి.మీ మేర, అంచులు తెగిన రోడ్ల ప్యాచ్ వర్కులు, జంగిల్ క్లియరెన్స్ కింద 33 రోడ్లలో 176.63 కి.మీ మేర రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వీటితోపాటు హనుమాన్‌పాలెం వద్ద ఆర్‌వోబీ నిర్మాణానికి రూ. 28 కోట్లు కేటాయించారు. కొండవీడు ఘాట్ రోడ్డుకు 6.8 కోట్లు కేటాయించారు. వెనిగండ్ల- జొన్నలగడ్డ రోడ్డు, గుంటూరు- నిడమర్రు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. గుంటూరు- బాపట్ల- చీరాల రోడ్డు, గుంటూరు- ఫిరంగిపురం రోడ్డు, ఎయిమ్స్ గేటు నుంచి ఎన్‌హెచ్- 16 వరకూ అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి మోక్షం లభించింది. మంగళగిరి- తెనాలి రోడ్డు దుగ్గిరాల వద్ద, చిలకలూరిపేట- పెదనందిపాడు రోడ్డు, వట్టిచెరుకూరు- పాండ్రపాడు, యర్రగుంట్లపాలెం- తుళ్లూరు, కాజ- ఉప్పలపాడు, గుంటూరు- హనుమాన్‌పాలెం, తెనాలి నారా కోడూరు రోడ్లను నిర్మించనున్నారు.