ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే నెల ఏడో తేదీన మెగా పేరెంట్, టీచర్ సమావేశం నిర్వహించనున్నారు. విశాఖ జిల్లాలోని 595 ప్రాథమిక, ఉన్నత, రెసిడెన్సియల్ పాఠశాలలు, కళాశాలల్లో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ సమావేశం నిర్వహిస్తారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యేందుకు 14 పాఠశాలలను ఎంపిక చేశారు. విద్యార్థులకు ఈ ఏడాది ఇంతవరకూ నిర్వహించిన ఎఫ్ఎ-1,2 పరీక్షల మార్కుల కార్డు, ఆరోగ్య సంబంధిత పరీక్షల వివరాలతో కూడిన కార్డులు అందజేస్తారు. విద్యార్థి చదువుపై తల్లిదండ్రులతో సంబంధిత టీచర్ చర్చిస్తారు.
తరువాత విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో సమావేశం నిర్వహించి పాఠశాలకు పలు ఇతోధికంగా సాయంచేసిన వ్యక్తులకు సన్మానిస్తారు. పాఠశాలల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచడం ఈ మెగా పేరెంట్, టీచర్ సమావేశాల ప్రధాన ఉద్దేశమని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులను సమాజానికి అందించడం, పాఠశాలకు అవసరమైన వసతుల కల్పనలో ప్రజల చేయూత, తదితర అంశాల కోసం సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాలలో జరగనున్న సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని కోరారు.