మునిసిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతులు లేకుండా నిర్మించిన రెండు అంతస్థుల వాణిజ్య భవనాన్ని మునిసిపల్ అధికారులు కూల్చి వేశారు. అక్రమ నిర్మాణంపై మూడుసార్లు నోటీసులు ఇచ్చినా.. సంబంధిత భవన యజమాని స్పందించకపోవడంతో ఈ చర్యకు దిగినట్టు అధికారులు వెల్లడించారు. నర్సీపట్నం పట్టణంలో 26వ వార్డుకు చెందిన చిటికెల కరుణాకరరావుకు పట్టణ పోలీస్ స్టేషన్ పక్క రోడ్డులోని గచ్చపువీధిలో 33 గజాల స్థలం వుంది. ఇందులో షాపు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గత ఏడాది మునిసిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కోరారు. వంద గజాల లోపు స్థలంలో నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేశారు.
అయినప్పటికీ ప్లాన్ ఆమోదం లేకుండానే భవన నిర్మాణం చేపట్టారు. చుట్టూ ఎటువంటి ఖాళీ స్థలం వదల్లేదు. మొదటి అంతస్థులోకి వెళ్లడానికి డ్రైనేజీ కాలువ మీదుగా రౌండ్ మెట్లు నిర్మించారు. రెండో అంతస్థు కూడా నిర్మించడానికి మొదటి అంతస్థులో నుంచి మెట్ల దారి కోసం శ్లాబ్‌లో ఖాళీ విడిచిపెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తికావడంతో ఒక ప్రైవేటు డెయిరీకి అద్దెకు ఇచ్చారు. తరువాత ఎన్నికలు రావడంతో పనులను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భవన నిర్మాణ పనులు ఆపేశారు. అయినప్పటికీ ప్లాన్ ఆమోదం లేకుండా భవనం నిర్మించడంతో మునిసిపల్ అధికారులు జూలై 25న మొదటి నోటీసు జారీ చేశారు. కరుణాకరరావు నుంచి సమాధానం రాకపోవడంతో రెండో నోటీసు, వారం రోజుల క్రితం మూడో నోటీసు ఇచ్చారు. అయినా స్పందన లేకపోవడంతో సోమవారం తెల్లవారుజామున కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ పక్క రోడ్డు, పాత మునిసిపల్ కార్యాలయం నుంచి గచ్చపువీధికి వెళ్లే రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. షాపులోని సామగ్రిని బయటకు తీయించి పై అంతస్థు శ్లాబ్‌కి పెద్ద పెద్ద రంధ్రాలు పెట్టారు. అనంతరం కింది అంతస్థు పిల్లర్లు, గోడలు కూల్చివేశారు. దీనిపై కమిషనర్ సురేంద్రను వివరణ కోరగా అనుమతులు లేకుండా నిర్మించడంతో కూల్చివేయించామని తెలిపారు.