ఏపీ అసెంబ్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఏపీ అసెంబ్లీ, మండలిలో.. 'జాతీయ ఈ విధాన్ యాప్ - నేవా' అమలు కోసం ఒప్పందం చేసుకున్నారు. పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, మండలి కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ కేంద్రప్రభుత్వం ఈ యాప్ రూపొందించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో 'నేవా' యాప్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 'నేవా' యాప్లో భాగస్వామ్యం అయితే..కాగిత రహిత విధానంలో అసెంబ్లీ కార్యకలాపాలు జరిగే అవకాశం ఉండనుంది.
అయితే ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు.పార్లమెంటరీ శాఖ మంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ఇందుకు అయ్యే ఖర్చులో కేంద్రమే 60 శాతం భరిస్తుందని వివరించారు. ఆన్లైన్, డిజిటల్ టెక్నాలజీ, పేపర్లెస్ గవర్నెన్స్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే అందరికంటే ముందు ఉన్నప్పటికీ శాసనవ్యవస్థలో మాత్రం జాప్యం జరిగిందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.