ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుడా చైర్మన్‌ గా సోమిశెట్టి ప్రమాణ స్వీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 26, 2024, 05:52 PM

తన నిజాయితీపై చంద్రబాబుకు నమ్మకం ఉన్నందున మరోసారి కుడా చైర్మన్‌ బాధ్యతలు అప్పగించారని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కర్నూలు  నగరంలోని ఎంఆర్సీ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, టీజీ భరత్‌, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.


అనంతరం మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబును తాను అన్నా అని సంబోధిస్తానని, పార్టీకి స్థాపించినప్పటి నుండి అధికార, ప్రతిపక్షాల్లో ఎక్కడ ఉన్నా రాష్ట్ర స్థాయిలో తాను ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నిజాయితీగా సేవలు అందించానని అన్నారు. తాను ఊహించని తీరులో పార్టీ మరోసారి తనకు సేవలందించే అవకాశం కల్పించండం గర్వంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా తనను కుడా చైర్మన్‌గా ఆఽశీర్వదించాలని కోరారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులకు అవకాశం కల్పించిందని, అందులో నీతిమంతుడైన ఎన్‌ఎండీ ఫరూక్‌కు న్యాయశాఖ కేటాయించారని, అలాగే టీజీ భరత్‌కు పరిశ్రమల శాఖ ఇచ్చి తగిన ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. లోకేష్‌ బాబు యువగళం పాదయాత్ర ద్వారా పార్టీలో వర్గాలు, లోపాలు, కుమ్ములాటలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారని, తనకు పదవి రావడం దాని కారణమే అని అన్నారు. యువకుడైన టీజీ భరత్‌ పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి తగిన గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కేఈ క్రిష్ణమూర్తి, ఫరూక్‌, తాను పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు చేశామని, ఆ క్రమంలోనే తమకు పార్టీ గుర్తింపు ఇస్తోందని అన్నారు. పార్టీని నమ్ముకుని ప్రతి ఒక్కరూ పని చేస్తూ పోవాలని, పదవులు వాటంతట అవే వస్తాయని తెలిపారు. జిల్లాలో కూడా 279 నాన్‌ లే అవుట్‌ వెంచర్లు ఉన్నాయని, వాటన్నిం టిని క్రమబద్ధీకరించి ప్రభుత్వాదాయం పెంచేదిశగా కార్యాచరణ రూపొందిస్తానని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలను మోసగించినవారి భరతం పడతామని హెచ్చరించారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని ప్రాంతాల నాయకులు కార్యకర్తలు గజమాలలు, బొకేలు, పూల కుండీలతో సోమిశెట్టిని సన్మానించారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, మీనాక్షినాయుడు, టీడీపీ నాయకుడు గౌరు వెంకటరెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com