ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ సభ్యత్వ కార్డు ఉంటే సమాజంలో ఓ గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. టీడీపీ రాకముందు తెలుగు వారికి సరైన గుర్తింపు లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం వంటిదని, అనేకమంది నేతలను తయారుచేసిన పార్టీ అని అభివర్ణించారు. కార్యకర్తల కోసం శిక్షణ తరగతులు నిర్వహించడమే కాకుండా, ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేసి డిగ్రీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ భావంతో ముందుకు వెళుతూ ప్రతిభకు పెద్దపీట వేసిన పార్టీ టీడీపీ... జాతీయస్థాయిలో టీడీపీ పోషించిన కీలకపాత్రలు మరే పార్టీకి సాధ్యం కాలేదు అని వివరించారు. పార్టీ కార్యక్రమాలకు టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నామని, ఎవరికి పదవి ఇచ్చినా అన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని అంశాలు పరిశీలించాకే ఇస్తానని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ పనైపోయిందని గతంలో మాటలు వినిపించాయని, ఆ మాటలు అన్నవారు ఇప్పుడేమయ్యారు? అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లతో మనం పోరాడాల్సి వస్తుందని ఊహించలేదు... గత ఐదేళ్ల కష్టాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం అని వ్యాఖ్యానించారు. మొన్నటి ఎన్నికల్లో మన స్ట్రయిక్ రేట్ ఓ చరిత్ర అని చంద్రబాబు చెప్పారు. సోషల్ రీఇంజినీరింగ్ చేశామని, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.