ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్- విజయవాడల మధ్య ఎన్‌హెచ్- 65ను ఎనిమిది వరసలుగా విస్తరించాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎనిమిది వరసలుగా విస్తరించేందుకు ఉన్న ఫీజుబిలిటీని అధ్యయనం చేయాల్సిందిగా నిర్దేశించింది. దీంతో ఎన్‌హెచ్ అధికారులు ప్రస్తుత డీపీఆర్‌లోనే 6, 8 వరసలకు సంబంధించి ఏది అవసరమో దానిని ఖచ్చితత్వంతో నిర్దేశించాల్సిందిగా కన్సల్టెన్సీకి సూచించారు. తుది డీపీఆర్ వచ్చిన తర్వాతే ఆరు వరసలా? ఎనిమిది వరసలా అన్న దానిపై స్పష్టత వస్తుందని విజయవాడ డివిజన్ ఎన్‌హెచ్ పీడీ శ్రీధర్ రెడ్డి చెప్పారు. ప్రస్తుత అవసరాల నేపథ్యంలో విజయవాడ-హైదరాబాద్ ఎన్‌హెచ్-65 ఎన్ని లేన్లు అవసరమో నిర్ణయించి భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్‌ను ఇవ్వవలసి ఉంది. ప్రస్తుతం ఎన్‌హెచ్ - 65 నాలుగు వరసలుగా ఉంది. విజయవాడ - హైదరాబాద్ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంది. ఈ రద్దీ కారణంగా రెండు నగరాల మధ్యన ప్రయాణం ఐదు గంటలకుపైగా సమయం పడుతోంది. వారాంతాలు, ప్రత్యేక సందర్భాలు, పండుగల వేళ అయితే ఇక చెప్పనక్కర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్‌హెచ్- 65ను ఆరు వరసలుగా విస్తరించాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో వస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో ఆరు వరసలుగా విస్తరించినా.. సరిపోదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రస్తుత అవసరాల రీత్యా ఆరు వరసలు చేయడం తధ్యం. రెండు తెలుగు రాష్ర్టాలను కలిపేటటువంటి జాతీయ రహదారి కావటంతో ఖచ్చితంగా దీర్ఘకాలిక అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చూస్తే కన్సల్టెన్సీ ఎనిమిది వరసలుగా విస్తరించేందుకు ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది.