నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన ‘ఉచిత ఇసుకపై జన ఆనందం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నాన్నారు. ఉచిత ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు, బిల్డర్లు, నిర్మాణదారులు, ట్రాక్టర్ల యజమానులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ట్రక్కు ఇసుక ధర రూ.5 వేలు నుంచి రూ.6 వేలు ఉండేదని.. అయినా ఇసుక దొరికేది కాదన్నారు. ఇప్పుడు అదే ఇసుక రూ.1000 వస్తోందన్నారు. వైసీపీ హయాంలో సీఎం జగనే ఇసుక వ్యాపారం చేశారని, ఎమ్మెల్యేలకు ప్రశ్నించే అవకాశం ఉండేది కాదని, ఏజెంట్లుని పెట్టుకుని ఇసుక వ్యాపారం నడిపించారని ఆరోపించారు.
వైసీపీ హయాంలో ఇసుక ట్రాక్టర్లకు లోడ్ చేసేవాళ్ళు కాదని, టిప్పర్లు లోడ్ చేసేవాళ్ళని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఎందుకంటే ట్రాక్టర్లు పేదోళ్ళవి.. టిప్పర్లు ముఖ్యమంత్రివి.. ఇసుక టిప్పర్లు టచ్ చేస్తే సీఎం కార్యాలయం నుంచి కాల్ చేసే వాళ్లని.. ఎస్పీలు, కలెక్టర్లు ఏజంట్లుగా పని చేశారని అన్నారు. 11 సీట్లు ఇచ్చి జనం ఛీ కొట్టి తిరస్కరించారని.. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేతలు సహకరించాలని సూచించారు. ఇసుక విషయంలో వైసీపీ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. జగన్ పాలనలో ఇసుక విషయంపై ఎమ్మెల్యే, ఎంపీలకు మాట్లాడే హక్కు కూడా ఉండేది కాదన్నారు. జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తే, చంద్రబాబు గాడిలో పెడుతున్నారన్నారు. ఇసుక కోళ్లగొట్టి జగన్ ప్రజల నెత్తిన భారం పెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేరుస్తున్నారని.. ‘ఇసుక అధిక ధరల అంతం.. చంద్రబాబు పంతం’ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా ఇసుక నేతల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించారు. తెలంగాణకు పరుగులు తీస్తున్న ఇసుక వాహనాలకు కళ్లెం వేయాలని నిర్ణయించారు. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు టెక్నాలజీతో నిఘాను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పది చెక్‌పోస్టులు ఉన్నాయి. వాటిని మరింతగా పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో శివారున తెలంగాణ సరిహద్దును ఆనుకుని ఉన్న గ్రామాల్లో మొత్తం 17 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయబోతున్నాయి. తెలంగాణలోకి ప్రవేశించడానికి మార్గాలు ఉన్న అన్ని గ్రామాల్లోను ఈ చెక్‌పోస్టులు పెడుతున్నారు.