ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాకు ఊహించని షాకిచ్చిన బ్రెజిల్.. డ్రాగన్ ఆశలపై నీళ్లు.. భారత్ బాటలో బ్రిక్స్ దేశం

international |  Suryaa Desk  | Published : Thu, Oct 31, 2024, 12:09 AM

భారత్, చైనా దేశాలు బ్రిక్స్ కూటమిలో కీలక సభ్య దేశాలనే సంగతి తెలిసిందే. ఈ రెండూ పొరుగు దేశాలైనప్పటికీ.. ఆసియాలోకెల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అయినప్పటికీ.. డ్రాగన్ వైఖరి కారణంగా ఇరు దేశాల మధ్య అంతగా సత్సంబంధాలు లేని సంగతి తెలిసిందే. దీంతో చైనా గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భారత్ భాగం కాలేదు. ఇప్పుడు భారత్ బాటలోనే మరో బ్రిక్స్ దేశం కూడా చేరింది.


చైనా లక్షల కోట్ల డాలర్లు గుమ్మరిస్తోన్న బీఆర్ఐలో చేరేందుకు బ్రెజిల్ నిరాకరించింది. అయితే చైనా నుంచి పెట్టుబడులు పొందడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు బ్రెజిల్ మొగ్గు చూపుతోంది. అధికారికంగా బీఆర్ఐలో చేరనప్పటికీ.. మౌలిక వసతుల ప్రాజెక్టులు, బీఆర్ఐతో అనుసంధానమైన పెట్టుబడుల విషయంలో చైనాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రెజిల్ తెలిపింది. అంటే చైనా నుంచి పెట్టుబడులకు ఆ దేశం సుముఖంగానే ఉంది కానీ.. పెట్టుబడుల కోసం పూర్తిగా డ్రాగన్‌పై ఆధారపడొద్దని భావనలో ఆ దేశం ఉంది.


చైనాతో సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్నామన్న బ్రెజిల్.. బీఆర్ఐ కోసం చైనా ప్రతిపాదించిన కాంట్రాక్ట్‌పై సంతకాలు చేసేందుకు మాత్రం నిరాకరించింది. ఆ ఒప్పందంలో మేం భాగం కావడం లేదంటూ.. చైనా ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చింది.


చైనా ఆశలపై నీళ్లు..


బ్రిక్స్ సభ్యదేశమైన బ్రెజిల్ బీఆర్ఐలో చేరుతుందని చైనా ఆశించింది. నవంబర్ 20న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బ్రెజిల్ పర్యటనకు వెళ్తున్నారు. అయితే చైనా అధినేత పర్యటనకు మూడు వారాల ముందే బీఆర్ఐలో చేరబోమంటూ బ్రెజిల్ స్పష్టతనిచ్చింది. బ్రెజిల్ ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రివర్గాలు ఇటీవల బీఆర్ఐలో చేరికకు వ్యతిరేకంగా గళం వినిపించాయి.


దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్.. బీఆర్ఐలో చేరడం వల్ల అమెరికాతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందనే భావనలో ఉంది. అదే సమయంలో బీఆర్ఐలో చేరినా.. ఇప్పటికిప్పుడే ఒనగూరే ప్రయోజనం కూడా ఆ దేశానికి కనిపించలేదు. దీంతో బీఆర్ఐలో చేరడానికి నిరాకరించింది.


బలమైన శక్తిగా ఎదుగుతోన్న బ్రెజిల్..


బీఆర్ఐలో ఇప్పటికే 150 దేశాలు భాగం కాగా.. 22 లాటిన్ అమెరికా దేశాలు కూడా ఇందులో చేరాయి. బ్రెజిల్ చేరిక ద్వారా బీఆర్ఐకి తన బలం మరింత పెరుగుతుందని చైనా భావించింది. చిన్నా చితకా దేశాలు చైనా అందించే సాయం కోసం బీఆర్ఐలో భాగమయ్యాయి. కానీ బ్రెజిల్ భౌగోళికంగా చాలా పెద్ద దేశం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పెద్దది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బ్రెజిల్ 11వ స్థానంలో ఉంది. అపారమైన సహజవనరులు ఆ దేశం సొంతం. బీఆర్ఐలో చేరిక వల్ల తమ దేశంలో ముడి ఖనిజవనరులను చైనాకు ఎగుమతి చేయాల్సి వస్తుందని.. దీని వల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఉండదని బ్రెజిల్ పాలకులు భావించారు.


బీఆర్ఐతో చైనా గుప్పిట్లోకి ప్రపంచ దేశాలు..


ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్తోన్న చైనా.. అందుకు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్‌ను ఉపయోగించుకుంటోంది. బీఆర్ఐ ద్వారా చాలా దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతూ.. ఆ దేశాలను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి.. తదనంతరం వాటిని తన చెప్పు చేతల్లో ఉంచుకునే వ్యూహాన్ని చైనా అనుసరిస్తోంది. మన పొరుగున ఉన్న పాకిస్థానే దీనికి అతిపెద్ద నిదర్శనం.


బీఆర్ఐలో భాగమైన చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్) కోసం చైనా 60 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్తుండటంతో.. ఇది తన సార్వభౌమత్వానికి భంగం కలిగించడమేనని భారత్ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు‌కు వ్యతిరేకంగా ఇండియా నిరసన వ్యక్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa