తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. నవంబరు 13వ తేదీన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ స్థానాన్ని నిర్వహిస్తారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. కైశిక ద్వాదశిని ప్రబోధనోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంధాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీ మహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీ మహా విష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్ళారు. కైశికద్వాదశినాడు ఆయనను మేల్కొల్పు చేయడం రివాజు. సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది.
పురాణాల ప్రకారం శ్రీవైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి. శ్రీ వరాహ స్వామి కైశికపురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెలుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. అందుకు నంబదువాన్ సమాధానంగా తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.
14వ శతాబ్దంలో ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపు జరుగుతూ ఉండగా సూర్య కిరణాలు స్వామివారి విగ్రహం మీద పడగానే భాగీ అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటి నుండి సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా సూర్యోదయానికి ముందే తెల్లవారుఝామున ఆలయ అర్చకులు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుండి ఉదయం 7.30 గంటల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు. దీనితో సాలకట్ల కైశికద్వాదశి ఉత్సవం పూర్తవుతుంది.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నవంబరులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. నవంబరు 2, 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు.
నవంబరు 15న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు. నవంబరు 20న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.