పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించడానికి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం దగ్గర అంగీకారం తెలపడమే కాకుండా ఆ నిందను తమ పార్టీపై రుద్దడానికి కుట్ర చేస్తున్నారని, ప్రత్యేక హోదా మాదిరిగా పోలవరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేందుకు ఒప్పందం జరిగిందని వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టను రెండు దశల్లో 45.57 మీటర్లకు పెంచి పూర్తి చేస్తామని పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ బోర్డు (పీఐబీ) ఆమోదించిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన చదివి వినిపించారు.
ఏపీ ప్రజల జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు కుదించి బ్యారేజీగా మార్చాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆక్షేపించారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును 45.57 మీటర్లకు పెంచి పూర్తి చేస్తామని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు చెబితే సరిపోదని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీ లేదా కేంద్ర జల శక్తి మంత్రితో చెప్పించే దమ్ముందా? అని మాజీ మంత్రి సవాల్ చేశారు.