పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తూ.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పార్వతీపురం మండలం, నర్సిపురం సమీపంలో కొబ్బరి తోటను ఏనుగుల గుంపు పుర్తిగా ధ్వంసం చేసింది. దాదాపు రెండు వందల కొబ్బరి చెట్లను పుర్తిగా లాగి విసిరేసాయి. ఏనుగుల సంచారంతో సమీపంలో ఉన్న పంట పొలాలు ధ్వంసమయ్యాయి. దీంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.కాగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం కొనసాగుతోంది. పెద్దబండపల్లి సమీపంలో ఇటీవల రైతు యాకోబుపై దాడి చేసి చంపిన గజరాజులు పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్నాయి.
అటవీ ప్రాంతంలో నుంచి జనారణ్యంలోకి వెళ్లి తిరుగుతున్నాయి. స్థానిక పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా గ్రామాలకు వెళ్లే రోడ్డుపై హల్ చల్ చేస్తున్నాయి. రహదారిపై గుంపులుగుంపులుగా నిలుస్తున్నాయి. ఎంత హారన్ కొట్టినప్పటికీ కదలడంలేదు. రోడ్డుపైనే తిష్టవేశాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనలో రోడ్డుపై 3 గంటలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి సమయం కావడంతో వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గజరాజులను త్వరగా బంధించి అటవీ ప్రాంతంలో వదలివేయాలని కోరుతున్నారు. మరోవైపు చుట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులు ఎప్పుడు ఏం చేస్తాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా రాష్ట్రంలోని జనావాసాలు, పంట పొలాలపై ఏనుగుల దాడులను అరికట్టేందుకు త్వరలో కుంకీ ఏనుగులతో రక్షణ చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్‌లైఫ్ అజయ్‌కుమార్ నాయక్, తిరుపతి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం తెలిపారు. పలమనేరు కౌండిన్య అటవీప్రాంతం నుంచి రెండేళ్ల క్రితం పులిచెర్ల మండలంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తున్న నేపధ్యంలో ఏనుగులు దాడులు చేస్తున్న తీరు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఏనుగుల గుంపు సంచరించే అటవీ ప్రాంతాలను మ్యాప్‌లో పరిశీలించారు. ఏనుగుల గుంపు జనారణ్యంలోకి వస్తుండడంతో జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గజదాడులను కుంకీ ఏనుగుల సాయంతో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఏనుగుల గుంపును కౌండిన్య అటవీప్రాంతం వైపు తీసుకెళ్లేందుకు కుంకీ ఏనుగులను తీసుకొస్తామని తెలిపారు.