గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుందని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఏపీకి ప్రస్తుతం రూ.9.64 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఆదాయంలో సగానికి పైగా నగదు వడ్డీ చెల్లించేందుకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంలో మూడింట రెండొంతులు వడ్డీలకే పోతున్నాయని జయ ప్రకాశ్ నారాయణ తెలిపారు. దేశంలో ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. అప్పుల భారం 20 శాతం ఉండాల్సి ఉండగా.. ఏపీ ఏకంగా 68 శాతానికి వెళ్లిందని నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.."దేశంలో ఏ రాష్ట్రానికీ ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నంత అప్పు లేదు. గత ఐదేళ్ల పాలనలో ఏపీ పట్ల నేరపూరిత నిర్లక్ష్యం వహించారు.
వైసీపీ ప్రభుత్వం సంపద సృష్టిపై దృష్టి పెట్టకుండా కేవలం బటన్ నొక్కడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. జగన్ సర్కార్ ఏపీలో రోడ్లను అధ్వాన్నంగా మార్చేసింది. దివాలా తీసే పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకువచ్చింది. వారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేని తనంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక క్రమశిక్షణ పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. వారి పాపపు భారాన్ని మోయాల్సింది నేడు తెలుగు ప్రజలే. సీఎం చంద్రబాబుపై ప్రజలకు అపార నమ్మకం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే సామర్థ్యం చంద్రబాబుకే ఉంది. సంక్షోభం నుంచి బయట పడేందుకు అపార అవకాశాలు ఉన్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు రోడ్ మ్యాప్ రూపొందించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం విద్యను అందించే విషయంలో ప్రతి విద్యార్థిపై దాదాపు లక్ష రూపాయలు ఖర్చుపెడుతోంది. ప్రభుత్వ బడుల్లో నూటికి 80 మంది విద్యార్థులకు పొట్ట కోస్తే అక్షరం ముక్క రావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పిల్లల్లో విద్యా ప్రమాణాలు, నైపుణ్యం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలి. ఏపీలో ప్రతి 16 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు. కాబట్టి ఇంకా టీచర్ల భర్తీ చేయాల్సిన అవసరం లేదు. రాజధానిగా అమరావతి ముమ్మాటికీ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నపట్టణాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రోడ్డు రవాణా, ప్రజారవాణా అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలో కక్షలు, కార్పణ్యాలను పక్కన పెట్టాలని కోరుతున్నా. సమాజాన్ని అల్లకల్లోలం చేయవద్దని చెబుతున్నా. కొంతమంది మూర్ఖులు చేస్తోన్న ఆ తరహా కార్యక్రమాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును కాపాడేలా నేతలు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేస్తున్నారు. ఇటువంటి చర్యలు మంచివి కావు" అని అన్నారు.