సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు టీడీపీ మాజీ ఎంపీ, రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్లు రైతు సంఘాల సమావేశం ఇవాళ(ఆదివారం) విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, రైతుల డిమాండ్ల సాధనపై నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈనెల4వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఏపీలోని అన్ని ప్రముఖ నగరాల్లో నిరసనలు చేపడుతున్నట్లు ప్రకటించారు.
రైతులకు గిట్టుబాటు ధరలు లేవని.. స్వామినాథన్ సిఫార్సుల అమలు కావడం లేదని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయడం లేదని, పారిశ్రామికవేత్తలకు వేల కోట్లు రుణ మాఫీ ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలనీ కోరారు. ఇప్పటి వరకు సహకార సంఘాలు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని తెలిపారు. దేశంలో ఉన్నన్ని సహకార పరపతి సంఘాలు, డైరీ, మత్స్యకార సంఘాలు కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. కార్మిక చట్టాలను మార్పులు చేసి లేబర్ కోడ్‌లను తీసి వేశారని మండిపడ్డారు. కార్మిక చట్టాలను కాపాడాలని కోరుతూ ఈనెల 26వ తేదీన ఢిల్లీలో నిరసన చేపడతామని వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు.