గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధికి చిహ్నాలైన రోడ్లు అధ్వానంగా మారాయని, రూ.860 కోట్లతో మరమ్మతులు చేపట్టి వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు ఉండేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనికోసం రూ. 860 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. శనివారం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో నిర్వహించిన గుంతల రహిత ఏపీ మిషన్‌ను ఆయన ప్రారంభించారు. పరవాడ-అచ్యుతాపురం రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చే పనులకు ముఖ్యమంత్రి కొబ్బరికాయ కొట్టారు. పరవాడ సినిమాహాల్ జంక్షన్‌లో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం స్వయంగా పొక్లయినర్ ఎక్కి రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడారు. ఐదేళ్లలో రోడ్లపై గుంతలు పెట్టడమే కాకుండా రాష్ట్రానికి అనేక రంగాల్లో గోతులు తవ్వారంటూ.. పరోక్షంగా మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శనాస్త్రా లు గుప్పించారు.
గత ఐదేళ్లలో రోడ్లకు కేవలం రూ.1000 కో ట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మిత్రుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సహకారంతో రానున్న ఐదేళ్లలో అన్ని గ్రామా ల్లో సిమెంట్ రోడ్లు వేసేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. జగన్ దిగిపోయే సమయానికి ఆర్‌అండ్‌బీ కాంట్రాక్టర్లకు రూ.1,060 కోట్లు బకాయి పెట్టారని, ఆర్‌అండ్‌బీ రోడ్లపై రూ.10.5 లక్షల కోట్ల అప్పు చేశారన్నా రు. ఇప్పుడు రోడ్లపై అప్పు అడగాలన్నా ఇచ్చేవాడు లేకుండా చేశారని ఆరోపించారు. కాగా, మిట్టల్ అనే వ్యక్తి అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రూ.70 వేల కోట్ల పెట్టుబడులతో స్టీల్ ప్లాంటు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరాన్ని రెండేళ్లలో పూర్తి చేసి..జూన్‌లో విశాఖకు తీసుకొచ్చే బాధ్యత తనదన్నారు. కాగా, గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో పెట్టిన రూ.1,061 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించినట్టు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. పరవాడలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి హాజరయ్యారు.