విజయవాడ తూర్పు నియోజకవర్గంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ... ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచించే ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఉద్ఘాటించారు. కుటుంబ సభ్యులకు కాకుండా వేరే సామాజిక వర్గానికి చెందిన వారిని టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందని మంత్రి కొలుసు పార్థసారథి కొనియాడారు. బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పెద్దపీట వేస్తుందని వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంటే... వైసీపీ మాత్రం జీవితకాలం అధ్యక్షుడిని తానేనని విస్తృత స్థాయి సమావేశంలో పెట్టుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం దూర దృష్టితో ఆలోచిస్తారని తెలిపారు. గతంలో ఎక్కడ చూసినా అసభ్యంగా మాట్లాడే వైసీపీ నేతలను చూసేవాళ్లమని.. నాలుగు నెలల నుంచి అటువంటివి ఏమీ లేవని చెప్పారు. ఏపీ అభివృద్ధి గురించి ఖూనీకోరులు కూడా మాట్లాడటం దెయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శలు చేశారు.