ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. డిసెంబర్ ఐదో తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ వెల్లడించింది.
ఇక ఉమ్మడి గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నవంబర్ 11న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నవంబర్ 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 19న దాఖలైన నామినేషన్లను పరిశీలన కార్యక్రమం ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. డిసెంబర్ 5న ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్
ఉప ఎన్నిక నోటిఫికేషన్ - నవంబర్ 11
నామినేషన్ల స్వీకరణ గడువు - నవంబర్ 18 వరకూ
నామినేషన్ల పరిశీలన - నవంబర్ 19
నామినేషన్ల ఉపసంహరణ - నవంబర్ 21 వరకూ
పోలింగ్ - డిసెంబర్ 5
ఫలితాల వెల్లడి - డిసెంబర్ 9
మరోవైపు షేక్ బాబ్జీ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ తరఫున గెలుపొందారు. అయితే 2023 డిసెంబర్ 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ బాబ్జీ చనిపోయారు. అయితే ఈ నియోజకవర్గం టీచర్ ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 మార్చి 29 వరకు ఉంది. దీంతో ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. డిసెంబర్ ఐదున పోలింగ్.. డిసెంబర్ 9వ తేదీన ఫలితాల వెల్లడి ఉంటుంది.