ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి రెడ్డి సత్యనారాయణ(99) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఇవాళ(మంగళవారం) ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని తన స్వగ్రామం పెదగోగాడలో సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. 1983 నుంచి 1985, 1989, 1994, 1999 వరకు వరుసగా ఐదు సార్లు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సత్యనారాయణ గెలిచారు. ఎన్టీఆర్ హయాంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా సత్యనారాయణ బాధ్యతలు నిర్వర్తించారు.
అలాగే టీటీడీ బోర్డు మెంబర్గా సేవలు అందించారు. రెడ్డి సత్యనారాయణ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి చేపట్టినప్పటికి చాలా నిరాడంబరంగా ఉండేవారు. కాగా ఈ రోజు ఉదయం ఆయన మృతి చెందారనే వార్త టీడీపీ నేతలకు తెలియడంతో సత్యనారాయణ నివాసానికి వెళ్లి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.