రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి. గతంలో పూర్తిగా నియంత్రణ లేకుండా వదిలేశారు. ఇప్పుడు... ధర్మబద్ధంగా చేయాలంటున్నా పోలీసులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఎందుకో అర్థం కావడంలేదు! కొందరు ఐపీఎ్‌సలు క్రిమినల్స్‌ను వెనకేసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారు. ధైర్యం లేని వారు పోలీసులుగా ఉండడం ఎందుకు? అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు. గత ఐదేళ్లు పోలీసు శాఖను ఆవరించిన అలసత్వం ఫలితంగానే ఇప్పుడు నేరాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘ఒకటి రెండు రేప్‌లు జరిగితే ఏమవుతుంది’ అని అప్పట్లో వ్యాఖ్యానించారని... దాని ఫలితంగానే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు.
తాను హోం శాఖను తీసుకుని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని హెచ్చరించారు. ‘‘మమ్మల్ని విమర్శించే వారికి చెబుతున్నా! నేను హోంశాఖ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది...’’ అని హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో సోమవారం దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ సమావేశంలో పవన్ పాల్గొన్నారు. అధికారులు చెప్పిందల్లా వినడం అయిపోయింది. ఇక చేతల్లోనే చూపించే సమయం వచ్చింది అని స్పష్టం చేశారు.