క్రీడారంగానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటివరకూ 2 శాతంగా ఉన్న క్రీడా రిజర్వేషన్లను 3 శాతానికి పెంచేందుకు సిద్ధమైంది. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించే వారికి భారీగా పోత్రాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. కొత్తగా తీసుకొచ్చే క్రీడా పాలసీలో ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. క్రీడా రిజర్వేషన్లను 3 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆమోదం తెలిపారు.
తొలుత దీన్ని యూనిఫాం సర్వీసె్‌సలో అమలు చేయాలని సూచించారు. అమరావతి సచివాలయంలో క్రీడా శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. ‘అందరికీ క్రీడలు’ అనే విధానంతో తీసుకొచ్చిన నూతన క్రీడా పాలసీపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కొత్త పాలసీలోని ప్రతిపాదనలు అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రాన్ని, అమరావతిని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు వీలుగా స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్ (ప్రతిభను పెంపొందించడం), స్పోర్ట్స్ ఏకో సిస్టమ్, గ్లోబల్ విజిబిలిటీ.. అనే నాలుగు అంశాల ప్రాతిపదికన నూతన పాలసీని రూపొందించినట్టు చెప్పారు. దీనిలో అందరికీ ఆటలు, టాలెంట్ గుర్తింపు, ప్రపంచ స్థాయి శిక్షణ, సౌకర్యాలు, ప్రోత్సాహకాలు, ఉద్యోగ భద్రత, క్రీడా సంఘాలతో సమన్వయం, టెక్నాలజీ వినియోగం, ప్రైవేటు రంగంతో కలిసి పనిచేయడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహణ, స్పోర్ట్స్ టూరిజం.. వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చామని చెప్పారు.
ఇతర రాష్ట్రాల్లోని క్రీడా పాలసీల కంటే మెరుగైన అంశాలను దీనిలో చేర్చామని, గ్రామస్థాయి నుంచే క్రీడల ప్రోత్సాహకానికి అవసరమైన ప్రణాళికను పొందుపరిచామని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అలాగే.. శాప్‌లో గ్రేడ్-3 కోచ్‌ల కోసం అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి 50శాతంరిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు.