అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపిందని, అయితే వరద నివారణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆ బ్యాంకు ప్రతినిధులు కోరారని మంత్రి నారాయణ తెలిపారు. సీడ్ కేపిటల్‌లో 48 కిలోమీటర్ల మేర మూడు కాల్వలు వస్తున్నాయన్నారు. రాజధాని అమరావతిలోని 217 చదరపు కి.మీ. కోర్ క్యాపిటల్ పరిధిలోను, ఆ వెలుపల పలుచోట్ల మినీ రిజర్వాయర్లు నిర్మించాలన్నారు.
నీరుకొండ వద్ద .04 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద .01 టీఎంసీలు, శాఖమూరు వద్ద .01 టీఎంసీల నిల్వకు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు ఉన్న లిఫ్ట్ కాకుండా ఉండవల్లి వద్ద 7,300 క్యూసెక్కులు పంపింగ్ చేసే మరొక లిఫ్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. వైకుంఠపురం వద్ద 5,600 క్యూసెక్కుల వాటర్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నెదర్లాండ్స్ కన్సల్టెన్సీ సూచించిందని చెప్పారు. అలాగే లాం వద్ద 0.3 టీఎంసీలు, పెదపరిమి వద్ద 0.33 టీఎంసీలు, వైకుంఠపురం వద్ద .17 టీఎంసీల రిజర్వాయర్లు ఏర్పాటుకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపిందన్నారు.