దేశంలోనే మొట్ట మొదటి పోర్ట్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ (వైజాగ్ స్టీల్)కు దీటుగా పక్కనే ఉన్న అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ప్రైవేటు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. రెండు దశల్లో మొత్తం రూ.1,50,000 కోట్ల పెట్టుబడులు, 55 వేలమందికి ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంగా భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ ఉక్కు తయారీ సంస్థలుగా పేరున్న ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కార్పొరేషన్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు కింద పోర్టు ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పడానికి ముందుకు వచ్చాయి. దీనికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి.
ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వంతో పలు దఫాలు సంప్రదింపులు జరిపారు. మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో విడివిడిగా చర్చలు నిర్వహించారు. ఈ రెండు సంస్థల నుంచి అందిన ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (ప్రి ఫీజిబిలిటీ రిపోర్టు) ఆధారంగా ఏపీఐఐసీ అధికారులు అనకాపల్లి జిల్లా కలెక్టరుతో సమన్వయం చేసుకుని అవసరమైన భూసేకరణ కూడా పూర్తి చేశారు. నక్కపల్లి మండలంలోని బుచ్చిరాజుపేటలో 102.18 ఎకరాలు, చందనాడలో 840.20 ఎకరాలు, డీఎల్ పురంలో 674.39 ఎకరాలు, రాజయ్యపేటలో 36.62 ఎకరాలు, వేంపాడులో 510.92 ఎకరాలు కలిపి మొత్తం 2,164.31 ఎకరాల భూములను సిద్ధం చేశారు. ఒకే బ్లాక్ కింద ఉన్న ఆ భూములు ప్రస్తుతం ఏపీఐఐసీ స్వాధీనంలోనే ఉన్నాయి. ముల్లాపురా (శివారు గ్రామం)ను రీ లొకేషన్ చేయడానికి ఆర్‌అండ్‌ఆర్ సెటిల్‌మెంట్ ప్లాన్ పురోగతిలో ఉంది. ఈ ప్రతిపాదిత భారీ ప్రాజెక్టుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టు ఇప్పటికే సీఎం చంద్రబాబుకు చేరింది. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే రాష్ట్ర కేబినెట్ ఆమోదం కోసం పంపడానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.