రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఓవైపు తాము అహర్నిశలూ కృషి చేస్తుంటే.. కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టానుసారం చెలరేగిపోతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుచితంగా పెట్టే పోస్టులను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఆడబిడ్డల జోలికి వచ్చి వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శనివారం శ్రీశైలం పర్యటనకు వచ్చిన ఆయన పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ దేనికీ భయపడదన్నారు. తీవ్రవాదులతోనే పోరాడామని.. ముఠానాయకులను పూర్తిగా కట్టడి చేశామని.. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని నియంత్రించామని తెలిపారు. ప్రస్తుతం రౌడీలు రాజకీయ ముసుగులు వేసుకున్నారని.. వారి ముసుగులను తొలగిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రౌడీలను రౌడీలుగా, నేరస్థులను నేరస్థులుగానే చూస్తామని.. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు.