పదవులు పొందిన నాయకులు పదిమందినీ కలుపుకొని వెళ్లాలి. సరికొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నాయకులతో ఆయన శనివారం మధ్యాహ్నం తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అవినీతి లేకుండా పని చేయాలి. పార్టీ మరింతగా ప్రజలకు దగ్గరయ్యేలా పని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రొటోకాల్ మర్చిపోవద్దు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు తగిన గౌరవం ఇస్తూ, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలి.
కేవలం జనసేన పార్టీ ప్రతినిధులుగానే కాకుండా ఎన్డీయే ప్రభుత్వంలో భాగంగా మాట్లాడాలి’’ అని పవన్ సూచించారు. ‘కుల గణాంకాలు కావాలని కొన్ని పార్టీలు కోరుతున్నాయి. నైపుణ్య గణాంకాలతో పాటు కుల గణాంకాలూ తీసుకోవాలి. దానిలో తప్పు లేదు. ఇది రాష్ట్రంలో సంపూర్ణంగా జరగాలన్నదే నా ఆలోచన. మీడియా వద్ద వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. పాలసీలపైనే చర్చ చేయాలి. ఏదైనా సమస్య ఉంటే నా పేషీ దృష్టికి తీసుకురావాలి’ అని పవన్ కోరారు. నామినేటెడ్ పదవులు పొందిన అందరికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఏపీఎంఎ్‌సఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు), ఇతర నాయకులకు ఆయన పేరు పేరునా అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు.