రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కీలకమైన అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి. తొలుత జూన్ ఆఖరులో రెండు రోజులపాటు నిర్వహించి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ప్రక్రియలను ముగించారు. జూలై ఆఖరులో మరోసారి ఐదు రోజులపాటు నిర్వహించి రెండో ఓటాన్ అకౌంట్ ఆమోదం, ఇతర అంశాలపై చర్చించారు. ఈసారి ఈనెల 11 నుంచి నిర్వహించే సమావేశాలలో వార్షిక బడ్జెట్ ఆమోదం, పలు కీలక అంశాలపై చర్చతోపాటు బిల్లులను ఆమోదించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి రెండు వారాలపాటు సమావేశాలు జరగనున్నాయి.
తొలిరోజైన సోమవారం బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టనున్నారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాల సమయంలోనే శాఖల వారీ నిధుల కేటాయింపు, అభివృద్ధి, సంక్షేమ అంశాలు, కీలక ప్రజాసమస్యలపై విస్తృత చర్చ సాగుతుంది. ఒకవైపు పద్దుల వారీ, మరోవైపు ప్రశ్నల రూపంలో జిల్లాకు సంబంధించిన అభివృద్ధి అంశాలపై మాట్లాడి నిధులు రాబట్టుకొనే అవకాశం ఉంటుంది. అలాంటి కీలక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు సమావేశాలను సద్వినియోగం చేసుకొని గళం విప్పాలని ప్రజానీకం కోరుతున్నారు.