గంజాయి రహిత జిల్లాయే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గంజాయిని రూపు మాపేందుకు కార్యరూపం దాల్చింది. ప్రతి జిల్లాలో గంజాయి నియంత్రణ బాధ్యతలను ఎస్పీలకు డీజీపీ తిరుమలరావు అప్పగించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి.. టార్గెట్ గంజాయి 100 రోజుల లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు.
ఈ ఏడాది ఆగస్టులో ఆయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టగా.. జిల్లావ్యాప్తంగా పర్యటించి గంజాయి మూలాలు గల ప్రాంతాల జాబితాను సిద్ధం చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి రవాణా, విక్రయాల అడ్డుకట్టపై ప్రత్యేక నిఘా పెట్టారు. వంద రోజుల్లోనే 40 కేసులు నమోదు చేసి.. 1,250 కేజీలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 106 మందిని అరెస్టు చేశారు. గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాలతో ఆర్టీసి కాంప్లెక్స్, పార్శిల్ సర్వీసులు, రైల్వే, బస్సు స్టేషన్లు, కంటైనర్లలో తనిఖీలు చేస్తున్నారు. డ్రోన్ల సహకారంతో కూడా శివారు, తీరప్రాంతాలను సైతం పరిశీలిస్తూ గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సుమారు 56మంది గంజాయి బాబులు, రవాణాదారులు పరారయ్యారు. వీరిలో ముగ్గురు శ్రీకాకుళానికి చెందిన వారు. మిగిలిన వారంతా మహరాష్ట్ర, బెంగళూరు, ఒడిశాకు చెందిన వారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.