ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడే ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ కె. దామోదర్‌రావు తెలిపారు. గురువారం విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్న నిందితులను మీడియా ముందు హాజరుపర్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటోనగర్ వంద అడుగుల రోడ్డు సమీపంలోని ఓ టీస్టాల్ వద్ద ఐదుగురు అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గమనించా రన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గుడివాడ, గుంటూరు, పటమట పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు చోరీలు చేశారని తెలిసిందన్నారు. వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బంగారు హేమంత్ నాగదుర్గ, బంగారు లక్ష్మిసాయి, ఆకుల మణికంఠ, ఎర్రజర్ల దుర్గాప్రసాద్, పెనుబోతుల జీవన్ ఆకాష్‌లు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. వీరిలో పటమట రెల్లీస్ కాలనీకి చెందిన బంగారు హేమంత్ నాగ దుర్గాబాబు, బంగారు లక్ష్మిసాయిలపై పాతకేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్ చేస్తామన్నారు. పటమట సీఐ వల్లభనేని పవన్ కిషోర్, ఎస్‌ఐ డి.హరికృష్ణలు పాల్గొన్నారు.