డిసెంబరు 1వ తేదీ ఆదివారం రావడంతో నవంబరు 30వ తేదీ శనివారమే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు, ఒంటరి మహిళలు, ఆయా వ్యాధుల చేత బాధింపబడేవారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబరు 29వ తేదీనే పెన్షన్ సొమ్మును బ్యాంకుల నుంచి డ్రా చేయాలని గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలోని ఎంపీడీవోలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. శనివారం సచివాలయ ఉద్యోగులందరూ పెన్షన్ పంపిణీ కోసం అందుబాటులో ఉండాలని జిల్లా అధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. శనివారం పెన్షన్ పొందని వారికి డిసెంబరు 2న అందజేయనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గుంటూరు జిల్లాలో 2,55,258 మందికి, పల్నాడు జిల్లాలో 2,75,070 మందికి, బాపట్ల జిల్లాలో 2,29,635 మందికి ఒక రోజు ముందే పెన్షన్ చేతికి రానుంది.