ఏపీ సచివాలయ ఉద్యోగులు వివాదంలో చిక్కుకున్నారు. త్వరలో జరుగనున్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోడానికి, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు, విందు పార్టీ ఏర్పాటు చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్‌లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారు.ఎక్సైజ్ నిబంధనల ప్రకారం... ఇటువంటి మందు పార్టీలు ఏర్పాటుకు ముందుగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
ఎటువంటి అనుమతులేవీ లేకుండానే విందు జరుగుతోందన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులకు గురువారం రాత్రి 11 గంటలకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులతో కలిసి కొండపావులూరి గార్డెన్‌లో సోదాలు చేశారు. అక్కడ ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం ఉండడంతో అది నిబంధనలకు విరుద్ధమని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అయితే తమకుఈ విషయం తెలియదని.. వెంకట్రామిరెడ్డి ఆహ్వానిస్తే వచ్చామని ఉద్యోగులు చెప్పారు. దీనితో పోలీసులు వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ సూర్యనారాయణ, గుంటూరు ఎక్సైజ్ ఏఈఎస్ మరియబాబు పాల్గొన్నారు. సచివాలయం క్యాంటీన్ ఎన్నికల నేపథ్యంలో మందు, విందు పార్టీ ఏర్పాటు చేశారు. మొత్తం 10 డైరెక్టర్ పదవుల కోసం 28 మంది పోటీ పడుతున్నారు. వెంకట్రామిరెడ్డి వర్గం నుంచి 11 మంది పోటీ చేస్తున్నారు. అయితే వెంకట్రామిరెడ్డి ఉద్యోగ నేత కంటే వైసీపీ కార్యకర్తగానే ఎక్కువగా వ్యవహరించారు. సాధారణ ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసినందుకు ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ప్రస్తుతం సచివాలయంలోకి అడుగు పెట్టేందుకు వీలు లేకపోవడంతో ఉద్యోగుల్ని ప్రభావితం చేసేందుకు వెంకట్రామిరెడ్డి మందు పార్టీ ఏర్పాటు చేసినట్టు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.కాగా ఎన్నికల్లో కొందరు డైరెక్టర్లను గెలిపించుకోడానికి సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు మందు, విందు ఏర్పాటు చేయడంతో అతనిపై ఎక్సైజ్ శాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.