సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా టీడీపీ గత నెల 26న ప్రారంభించిన సభ్యత్వ నమోదు ప్రక్రియను గేరు మార్చి స్పీడు పెంచాలని టీడీపీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సూచించారు. గురువారం పార్టీ కార్యాలయంలో విజయనగరం నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశం టీడీపీ నగర అధ్యక్షుడు ప్రసాదుల ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో సభ్యత్వ నియామవళిని ఖచ్చితంగా పాటించిన పార్టీ టీడీపీయేనన్నారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి సభ ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిర్వహించుకుంటూ, ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 28న మహానాడును కూడా క్రమం తప్పకుండా నిర్వహించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.. గతంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారివి తప్పనిసరిగా రెన్యువల్ చేయాలన్నారు. కొత్తగా సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపే వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమావేశంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, విజ్జపు ప్రసాద్, ప్రసాదుల ప్రసాద్, ఆల్తి బంగారుబాబు, బొద్దల నర్సింగరావు, కర్రోతు నర్సింగరావు, అనురాధ బేగం,తదితరులు పాల్గొన్నారు.