నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ (శుక్రవారం) తీవ్ర వాయుగుండంగానే కొనసాగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఫెంగల్ తుపాను కదులుతోందని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 240 కి.మీ., నాగపట్నానికి 330 కి.మీ., పుదుచ్చేరికి 390 కి.మీ., చెన్నైకి 430 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమైందని కూర్మనాథ్ వెల్లడించారు.శనివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని కూర్మనాథ్ వెల్లడించారు. ఇతర జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ వెల్లడించారు.